Sri Padma Mahapuranam-I    Chapters   

షట్త్రింశత్తమోధ్యాయః

పులస్త్య ఉవాచ :- తతో దేవాః ప్రయాతాస్తే విమానైర్బహుభిస్తదా | రామోప్యనుజగామాశు కుంభయోనే స్తపోవనమ్‌ || 1

ఉక్తం భగవతా తేన భూయోప్యాగమనం క్రియాః |

పూర్వమేవ సభాయాం చ యో మాం ద్రష్టుం సమాగతః || 2

తదహం దేవతాదేశాత్తత్కార్యార్ధే మహామునిమ్‌ | పశ్యామి తం మునిం గత్వా దేవదానవపూజితమ్‌ || 3

ఉపదేశం చ మే తుష్టః స్వయం దాస్యతి సత్తమః | దుఃఖీ యేన పునర్మర్త్యో న భవామి కదాచన || 4

పితా దశరథో మహ్యం కౌసల్యా జననీ తథా | సూర్యవంశే సముత్పన్నస్తథాప్యేవం సదుఃఖితః || 5

రాజ్యకాలే వనే వాసో భార్యయా చానుజేన చ | హరణం చాపి భార్యాయా రావణన కృతం మమ || 6

అసహాయేన తు మయా తీర్త్వా సాగరముత్తమమ్‌ | రుద్ధాం తు తాం పురీం సర్వాం కృత్వా తస్య కులక్షయమ్‌ || 7

దృష్టా సీతా మయా త్యక్తా దేవానాం తు పురస్తదా | శుద్దాం తాం మాం తదోచుస్తే మయా సీతా తథా గృహమ్‌ || 8

సమానీతా ప్రీతిమతా లోకవాక్యాద్విసర్జితా | వనే వసతి సా దేవీ పురే చాహం వసామి వై || 9

జాతోహముత్తమే వంశ ఉత్తమోహం ధనుష్మతామ్‌ |

ఉత్తమం దుఃఖమాపన్నో హృదయం నైవ భిద్యతే || 10

ముప్పది ఆరవ అధ్యాయము

అటు తరువాత దేవతలు పెక్కు విమానముల నెక్కి వెళ్ళిపోయిరు. రాముడు కూడా అగస్త్యుని తపోవనానికి వెళ్ళెను. మునుపు అగస్త్యుడు అశ్రమమునకు రమ్మని నన్ను పిలిచెను కదా ! దేవాదేశముచే నేను దేవదానవ పూజితుడైన ఆ మునిని వెళ్ళి చూచెదను. ఆ మహానుభావుడు సంతుష్ఠుడై నాకు ఉపదేశమిచ్చును. దానిచే నేను దుఃఖమును మరల పొందను. నా జననీ జనకులు కౌసల్య దశరథులు - సూర్యవంశము నాది. అయిననూ ఇట్టి దుఃఖాన్ని పొందితిని. రాజ్యకాలమున భార్యతో, సోదరునితో వనవాసము, భార్య రావణునిచే అపహరింపబడటము, అసహాయుడనై ఉత్తమ సాగరమును దాటి లంకాపురిని ముట్టడించి, రావణకుల క్షయము చేసితిని. అక్కడ సీతను చూచి దేవతల ఎదుట ఆమెను విడిచి వైచితిని. అంత వారు ఆమె పవిత్రురాలని నాతో అనగా గృహమునకు తెచ్చితిని. మరల లోక వాక్యముచే విసర్జించితిని. సీత వనమునందు, నేను పురమునందు నివసించుచుంటిమి. ఉత్తమ వంశమున జన్మించిన నేను, ధనుష్కులలో ఉత్తముడిని - ఇపుడు ఉత్తమ దుఃఖమును పొందితిని . నా హ్మదయ మింకనూ బద్ద లవదు కదా;

మూ: - వజ్రసారస్య సారేణ ధాత్రాహం నిర్మితో ధ్రువమ్‌ | ఇదానీం బ్రాహ్మణాదేశాద్ర్భమామి ధరణీతలే || 11

తపస్థితస్తు శూద్రోసౌ మయా పాపో నిపాతితః | దేవవాక్యాత్తు మే భూయః ప్రాణో మే హృది సంస్థితః || 12

పశ్యామి తం మునిం వంద్యం జగతోస్య హితే రతమ్‌ | దృష్టేన మే తథా దుఃఖం నాశ##మేష్యతి సత్వరమ్‌ || 13

ఉదయేన సహస్రాంశోర్హిమం యద్వద్విలీయతే | తద్వన్మే దుఃఖసంప్రాప్తిః సర్వదా నాశ##మేష్యతి || 14

దృష్ట్వా చ దేవాన్‌ సంప్రాస్తానాగస్త్యో భగవానృషిః | అర్ఘ్యమాదాయ సుప్రీతః సర్వాంస్తానభ్యపూజయత్‌ || 15

తే తు గృహ్య తతః పూజాం సంభాష్య చ మహామునిమ్‌ | జగ్ముస్తేన తదా హృష్టా నాకపృష్టం సహానుగాః || 16

గతేషు తేషు కాకుత్థ్సః పుష్పకాదవరుహ్య చ | అభివాదయితుం ప్రాప్తః సోగస్త్యమృషిసత్తమమ్‌ || 17

రాజోవాచ : - సుతో దశరథస్యాహం భవంతమభివాదితుమ్‌ | ఆగతో వై ముని శ్రేష్ఠ సౌమ్యేనేక్షస్వ చక్షుషా || 18

నిర్ధూతపాపస్త్వాం దృష్ట్వా భవామీహ న సంశయః | ఏతావదుక్త్వా స మునిమభివాద్య పునః పునః || 19

కుశలం భృత్యవర్గస్య మృగాణాం తనయస్య చ | భగవద్దర్శనాకాంక్షీ శూద్రం హత్వా త్విహాగతః || 20

బ్రహ్మ నన్ను వజ్రసారము యొక్క మూలముతో నిర్మించెను. ఇపుడు బ్రాహ్మణాదేశమున భూమిపై భ్రమించుచుంటిని. తపము నాచరించుచున్న శంబూకూడను పాపిని నేల కూల్చగా దేవ వాక్యముచే ప్రాణము హృదయములో నిలిచెను. ఈ జగత్తు యొక్క హితమున మునిగిన మునిని కలిసెదను - అతనిని చూచిన నా దుఃఖము వెంటనే నశించును. సూర్యోదయముచే మంచు యెట్లు కరుగునో అట్లే నా దుఃఖము కూడా నశించును. వచ్చిన దేవతలను జూచి అగస్త్యుడను దివ్యర్షి అర్ఘ్యమును గ్రహించి ప్రీతితో వారందరినీ పూజించెను. వారా పూజను స్వీకరించి, మహామునితో మాటలాడి సహచరులతో స్వర్గమునకు వెళ్ళిరి. వారట్లు వెళ్ళగా రాముడు పుష్పకము నుండి దిగి అగస్త్యుని వద్దకు వచ్చి అభివాదనము చేసెను. రాజు అనెను. - 'మునిశ్రేష్ఠా' దశరథ సుతుని నేను మిమ్ము నమస్కరించుచుంటిని. ఆదరముతో చూడుము. మిమ్ము చూచి నేను పాపమును పోగొట్టుకొనెదను. అని మరల మరల మునికి నమస్కరించెను. ' మా భృత్యవర్గానికి, పరివారానికి కుశలమే. క్షుద్రుని జంపి నేను మిమ్ము చూడగోరి వచ్చితిని.'

ఆగస్త్య ఉవాచ :- స్వాగతం తే రఘశ్రేష్ఠ జగద్వంద్వ సనాతన |

దర్శనాత్తవ కాకుత్థ్స కాకుత్థ్స పూతో హం మునిభిస్సహ || 21

త్వత్కృతే రఘుశార్దూల గృహాణార్ఘం మహాద్యుతే | స్వాగతం నరశార్దూల దిష్ట్యా ప్రాప్తోసి శత్రుహన్‌ || 22

త్వం హి నిత్యం బహుమతో గుణౖర్బహుభిరుత్తమైః | అతస్త్వం పూజనీయో వై మమ నిత్యం హృది స్థితః || 23

సురా హి కథయన్తి త్వాం శూద్రఘాతినమాగతమ్‌ | బ్రాహ్మణస్య చ ధర్మేణ త్వయా వై జీవితః సతః || 24

ఉష్యతాం చేహ భగవః సకాశే మమ రాఘవ | ప్రభాతే పుష్కకేణాసి గంతాయోధ్యాం మమామతే || 25

ఇదం చాభరణం సౌమ్య సుకృతం విశ్వకర్మణా | దివ్యం దివ్యేన వపుషా దీప్యమానం స్వతేజసా || 26

ప్రతిగృహ్ణీష్వ రాజేంద్ర మత్ర్పియం కురు రాఘవ | లబ్ధస్య హి పునర్దానే సుమహత్ఫలముచ్యతే || 27

త్వం హి శక్తః పరిత్రాతుం సేంద్రానపి సురోత్తమాన్‌ | తస్మాత్ర్పతీచ్ఛస్వ నరర్షభ || 28

అథోవాచ మహాబాహురిక్ష్వాకూణాం మహారథః | కృతాంజలిర్మునిశ్రేష్ఠం స్వం చ ధర్మ మనుస్మరన్‌ || 29

ప్రతిగ్రహో వై భగవంస్తవ మేత్ర విగర్హితః | క్షత్రియేణ కథం విప్ర ప్రతిగ్రాహ్యం విజాతినా || 30

అనగా అగస్త్యుడిట్లనెను:- ''రామా ! జగద్వంద్వా ! సనాతనా ! నీకు స్వాగతము. నీ దర్శనముచే నేను. మునులు పవిత్రులమైతిమి. ఇదిగో నీకై అర్ఘ్యము. నాభాగ్యముచేత నీవిక్కడికి వచ్చితివి. పెక్కు ఉత్తమ గుణములు గల నీవు నిత్యము పూజ్యుడవు గదా : కనుక నిన్ను మా ఎదలోనుంచి పూజించవలెను. దేవతలు నీవు శూద్రుని జంపి వచ్చితినని అనిరి. బ్రాహ్మణ పుత్రుని నీవు నీ ధర్మముతో బ్రతికించితివి. రామా ! నీవు నా చెంత నుండుము. ఉదయాన పుష్పకవిమానములో అయోధ్యకు వెళ్ళుము. ఇక ఈ ఆభరణము విశ్వకర్మ నిర్మించినది. తన కాంతిచే ప్రకాశించుచున్న ఈ ఆభరముణమును నాయనా ! నీవు గ్రహించి నాకు ప్రియము చేకూర్చుము. లభించిన దానిని మరల దానమిచ్చుటచే గొప్ప ఫలము లభించును ఇంద్రుడు మొదలైన దేవతోత్తములననందరినీ రక్షింప నీవు సమర్దుడవు కదా ! కనుక నీకే ఇచ్చుచుంటిని. గ్రహించుము అనగా ఇక్ష్వకుమహారథుడగు రాముడు చేతులు జోడించి, తన ధర్మమును స్మరిస్తూ ఇట్లనెను. '' భగవాన్‌, ప్రతిగ్రహము (తీసుకొనుట) అనునది నాకు గర్హితము. క్షత్రియుడను, విజతీయుడనగు నేను దీనినెట్లు స్వీరకంచెద? '' 30

బ్రహ్మణన తు యద్దత్తం తన్మే త్వం వక్తుమర్హసి | సపుత్రో గృహవానస్మి సమర్థోస్మి మహామునే || 31

ఆపదా చ న చాక్రాంతః కథం గ్రాహ్యః ప్రతిగ్రహః | భార్యా మే సుచిరం నష్టా న చాన్యా మమ విద్యతే || 32

కేవలం దోషభాగీ చ భవామీహ న సంశయః | కష్టాం చైవ దశాం ప్రాప్య క్షత్రియోపి ప్రతిగ్రహీ || 33

కుర్వన్న దోషమాప్నోతి మనురేవాత్ర కారణమ్‌ | వృద్ధౌ చ మాతాపితరౌ సాధ్వీ భార్యా శిశుః సుతః || 34

అప్యకార్యశతం కృత్వా భర్త వ్యా మనురబ్రవీత్‌ | నాహం ప్రతీచ్ఛే విపర్షేత్వయా దత్తం ప్రతిగ్రహమ్‌ || 35

న చ మే భవతా కోపః కర్యో వై సురపూజిత || 36

బ్రాహ్మణుడిచ్చినదానిని నీవు చెప్పుము. పుత్రులు గల వానిని, గృహము గలవానిని, సమర్ధుడిని, ఆపదను కూడా పొందలేదు. ఎట్లీ దానమును తీసికొనెదను? ఏకపత్నీవ్రతుడగు నా భార్య కూడా లేదిపుడు. ఇక నిస్సంశయముగా నేను దోషమున పాలుపంచుకొనెడివాడినయ్యెదను. కష్టకాలమును పొందిన క్షత్రియుడు కూడా దానము స్వీకరించిన దోషమును పొందడనుటలో మనువే ప్రమాణము. తల్లిదండ్రులు వృద్ధులు, భార్య సాధ్వి, పుత్రుడు శిశువు అయినవాడు అకార్యములు వందచేసైనా వారిని పోషించవలెనని మనువనెను. ఓ మునిసత్తమా ! నేను నీ దానమును స్వీకరించలేను. మీకు కోపము కలిగించుట నా ఉద్దేశము కాదు. 36

అగస్త్య ఉవాచ:- న చ ప్రతిగ్రహే దోషో గృహీతే పార్థివైర్నృప |

భవాన్వై తారణ శక్తసై#్త్రలోక్యస్యాపి రాఘవ || 37

తారయ బ్రాహ్మణం రామ విశేషేణ తపస్వినమ్‌ | తస్మాత్ర్పదాస్యే విధివత్ర్పతీచ్ఛస్వ నరాధిప|| 38

అనగా అగస్త్యుడనెను. పాలకులు దానమును గ్రహించిన దోషములేదు. రాజా ! నీవు ముల్లోకములను తరింపజేయ సమర్ధుడవు. బ్రాహ్మణుడూ అందునా తపస్వియైన ఇతడిని నీవు తరింపజేయుము. అందుకని నేను నీకిది దానమిచ్చుచుంటిని. స్వీకరించుము. 38

రామ ఉవాచ : క్షత్రియేణ కథం విప్ర ప్రతిగ్రాహ్యం విజానతా |

బ్రాహ్మణన తు యద్దత్తం తన్మే త్వం వక్తుమర్హసి || 39

అని అగస్త్యుడనగా రాముడనెను !- తెలిసి క్షత్రియుడు దానమెట్లు స్వీకరించును - బ్రాహ్మణుడెట్లిచ్చెనో నాకు చెప్పుము. 39

ఆగస్త్య ఉవాచ :- ఆసీత్కృతయుగే రామ బ్రహ్మభూతే పురాతనే |

అపార్థివాః ప్రజాః సర్వాః సురాణాం చ శతక్రతుః || 40

తాః ప్రజా దేవదేవేశం రాజార్థం సముపాగమన్‌ | సురాణాం విద్యతే రాజా దేవేదేవః శతక్రతుః || 41

శ్రేయసేస్మాసు లోకేశ పార్థివం కురు సాంప్రతమ్‌ | యస్మిన్పూజాం ప్రయుంజానాః పురుషా భుంజతే మహీమ్‌ || 42

తతో బ్రహ్మా సుర శ్రేష్టో లోకపాలాన్సవాసవాన్‌ | సమాహూయా బ్రవీత్సర్వాంస్తేజోభాగోత్ర యుజ్యతామ్‌ || 43

తతో దదుర్లోకపాలాశ్చతుర్భాగం స్వతేజసా | అక్షయశ్చ తతో బ్రహ్మా యతో జాతోక్షయో నృప || 44

అపుడు అగస్త్యుడు బదులుపలికెను. ''రామా ! బ్రహ్మభూతుమైన కృతయుగమునందు ప్రజలందరూ పాలకులు లేనివారైరి. దేవతలరాజు శతక్రతువుండెను. తమకు రాజుకావలెనని ప్రజలు దేవేశుని చేరిరి. 'దేవతలరాజు శతక్రతు వుండగా మాకు పాలకుడు లేకున్నాడు. మా శ్రేయస్సుకై పాలకుని ఇప్పుడు సృష్టించుము. అతనిని పూజించుచు పురుషులు రాజ్యముననుభవింతురు.' అనగా అపుడు బ్రహ్మ ఇంద్రాది లోకపాలకులను పిలిచి వారి తేజస్సుయొక్క భాగమును వినియోగించమని యనెను. అపుడు లోకపాలురు తమ తేజస్సున నాలుగవ భాగమును ఇచ్చిరి. క్షయములేనందున బ్రహ్మను అక్షయుడందురు. 44

తం బ్రహ్మా లోకపాలానామంశం పుంసామయోజయత్‌ | తతో నృపస్తదా తాసాం ప్రజానాం క్షేమపండితః || 45

తత్రైంద్రేణ తు భాగేన సర్వానాజ్ఞాపయేన్నృపః | వారుణన చ భాగేన సర్వాన్పుష్ణాతి దేహినః || 46

కౌబేరేణ తథాంశేన త్వర్థాన్‌ దిశతి పార్థివః యశ్చ యామ్యో నృపే భాగస్తేన శాస్తి చ వై ప్రజాః || 47

తత్ర చైంద్రేణ భాగేన నరేంద్రోసి రఘూత్తమ | ప్రతిగృహ్ణీష్వాభరణం తారణార్థే మమ ప్రభోః || 48

ఆ బ్రహ్మ లోకపాలుర అంశలను నరులయందు వినియోగించి ప్రజలక్షేమమును తెలిసిన పాలకుని చేసెను. ఇంద్రుని అంశ##చే పాలకుడు అందరినీ ఆజ్ఞాపించును. వరుణుని యంశ##చే అందరినీ పోషించును. కుబేరుని అంశ##చే అందరికీ ప్రయోజనముల చేకూర్చును. యముని అంశ##చే ప్రజలను శాసించును. నీవు ఇంద్రుని అంశ##చే పాలకుడవైతివి. నన్ను తరింపజేయుటకు ఆభరణమును స్వీకరించుము. 48

తతో రామః ప్రజగ్రాహ మునేర్హస్తాన్మహాత్మనః | దివ్యమాభరణం చిత్రం ప్రదీప్తమివ భాస్కరమ్‌ || 49

ప్రతిగృహ్య తతోగస్త్యాద్రాఘవః పరవీరహా | నిరీక్ష్య సుచిరం కాలం విచార్య చ పునః పునః || 50

మౌక్తికాని విచిత్రాణి ధాత్రీఫలసమాని చ | జాంబూనదనిబద్ధాని వజ్రవిద్రుమనీలకైః || 51

పద్మరాగైః సగోమేధైర్వైడూరైః పుష్పరాగక్యైః | సునిబద్ధం సువిభక్తం సుకృతం విశ్వకర్మణా || 52

దృష్ట్వా ప్రీతిసమాయుక్తో భూయశ్చేదం వ్యచింతయత్‌ | నేదృశాని చ రత్నాని మయా దృష్టాని కానిచిత్‌ || 53

ఉపశోభానిబద్ధాని పృథ్వీమూల్యసమాని చ | విభీషణస్య లంకాయాం న దృష్టాని మయా పురా|| 54

ఇతి సంచింత్యమనసా రాఘవస్తమృషిం పునః | ఆగమం తస్య దివ్యస్య ప్రష్టుం సముపచక్రమే || 55

అత్యధ్భుతమిదం బ్రహ్మన్న ప్రాప్యం చ మహీక్షితామ్‌ | కథం భగవతా ప్రాప్తం కుతో వా కేన నిర్మితమ్‌ || 56

కుతూహలవశాచ్చైవ పృచ్ఛామి త్వాం మహామతే | కరతలే స్థితే రత్నే కరమధ్యం ప్రకాశ##తే || 57

అథమం తద్విజానీయాత్‌ సర్వశాస్త్రేషు గర్హితమ్‌ | దిశః ప్రకావయేద్యత్తన్మధ్యమం మునిసత్తమ || 58

ఊర్ద్వగం త్రిశిఖం యత్‌ స్యాదుత్తమం తదుదాహృతమ్‌ | ఏతాన్యుత్తమజాతీని ఋషిభిః కీర్తితాని తు || 59

అనగా అపుడు రాముడు మునిచేతినుండి దివ్యమై, సూర్యునివలె జ్వలించుచున్న ఆభరణమును గ్రహించెను. దానిని గ్రహంచి, తేరిపారజూచి చాలాసేపు ఆలోచించెను ముత్యములు విచిత్రముగా, ధాత్రీఫలమువలె నుండెను. బంగారములో పొదగబడెను. వజ్ర విద్రుమనీలములు, పద్మరాగములు గోమేధములు, వైడూర్యములు, పుష్యరాగములు పొదగబడినవి. విశ్వకర్మ దానినట్లు చక్కగా నిర్మించెను. అట్టి ఆభరణమును చూచి ప్రీతినొందిన రాముడు మరల ఆలోచించెను. ''ఇట్టి రత్నములనింతకుమును పెప్పుడూ చూడలేదు. ఇవి ప్రకాశించుచూ భూమియంత విలువగలవిగా నున్నవి. విభీషణుని లంకయందునూ ఇట్టివానిని మునుపు నేను చూడలేదు.'' అని ఆలోచించి రాముడు ఆమునిని ఆభరణమెట్లు వచ్చినదో తెలియగోరి అడిగెను. ''మహామునీ! అత్యద్భుతమైన దీనిని రాజులూ పొందలేరు - మీరెట్లు పొందితిరి? దేనినుండి ఎవరు నిర్మించిరి? కుతూహలము వలన అడుగుచుంటిని. అరచేతిలో నుంచినచో అరచేతి మధ్యభాగము ప్రకాశించిన యెడల అది అన్ని శాస్త్రములలో నిందించబడిన ''అధమ రత్నమని తెలయ పలయును. దిక్కులను ప్రకాశింపజేసినచో అది మధ్యమము. దాని కాంతి మూడు పాయలై పైకి పోవుచున్న ''ఉత్తమరత్నమని'' తెలియవలయును. ఇవి ఉత్తమజాతి రత్నములని ఋషులందురు. 59

ఆశ్చర్యాణాం బహూనాం హి దివ్యనాం భగవాన్నిధిః ఏవం వదతి కాకుత్థ్సే మునిర్వాక్యమథాబ్రవీత్‌ || 60

అగస్త్య ఉవాచ: శ్రుణు రామ పురా వృత్తం పురా త్రేతాయుగే మహత్‌ |

ద్వాపరే సమనుప్రాప్తే వనే యద్దృష్టవానహమ్‌ || 61

ఆశ్యర్యం సుమహాబాహో నిబోధ రఘునందన | పురా త్రేతాయుగే హ్యాసీదరణ్యం బహువిస్తరమ్‌ || 62

సమంతాద్యోజనశతం మృగవ్యాఘ్రవర్జితమ్‌ | తస్మిన్నిష్పురుషేరణ్య చికీర్షుస్తప ఉత్తమమ్‌ | | 63

ఆహమాక్రమితుం సౌమ్య తదరణ్యముపాగతః | తస్యారణ్యస్య మధ్యం తు యుక్తం మూలఫలైస్సదా || 64

శాకైర్బహువిధాకారైర్నానారూపైః సుకాననైః | తస్యారణ్యస్య మధ్యే తు పంచయోజన మాయతమ్‌ || 65

హంసకారండవాకీర్ణం చక్రవాకోపశోభితమ్‌ | తత్రాశ్చర్యం మయా దృష్టం సరః పరమశోభితమ్‌ || 66

విసారికచ్ఛపాకీర్ణం బకపంక్తిగణౖర్యుతమ్‌ | సమీపే తస్య సరసస్త పస్తప్తుం గతః పురా|| 67

దేశం పుణ్యముపేత్యైవం సర్వహింసావివర్జతమ్‌ | తత్రాహమవసం రాత్రిం నైదాఘీం పురుషర్షభ || 68

ప్రభాతే పునరుత్థాయ సరస్తదుపచక్రమే | అథాపశ్యం శవమహమస్సృష్టజరసం క్వచిత్‌ || 69

తిష్ఠంతం పరయా లక్ష్మ్యా సరసో నాతిదూరతః | తదర్ఠం చింతయానోహం ముహూర్తమివ రాఘవ || 70

మీరు అనేక దివ్యమైన ఆశ్చర్యములకు నెలవు. '' అని రాముడనగా ఆగస్త్యుడనెను. ''రామా ! వినుము. మునుపు త్రేతాయుగమున జరిగినది. ద్వాపరము రాగా వనమున నేను గాంచితిని. ఇది ఆశ్చర్యమును కలిగించును. వినుము. పూర్వము త్రేతాయుగమున అతివిశాలమైన అరణ్యముండెను. ఎల్లెడలా వందలకొలది యోజనముల విశాలమైనది. అందు మృగ, వ్యాఘ్రములు లేకుండెను. అట్టి నిర్జనారణ్యమున ఉత్తమ తపస్సు చేయవలెనని నేను అరణ్యమును చేరితిని. ఆ అరణ్యమధ్యలో కందమూలఫలాలుండెను. వివిధశాకములుండెను. ఆ అరణ్యం మధ్యలో ఐదుయోజనాల వెడల్పుగల సరస్సుండెను. హంసలు, అడవికొంగలు, చక్రవాకములు ఉండెను. ఎల్లడెలా తాబేళ్ళు తిరుగుచుండెను. కొంగలు బారులు కట్టియుండెను. ఆ సరస్సు తీరమున ఉత్తమ తపస్సు చేయడానికి నేను వెళ్లితిని. అట్టి శుభప్రదేశాన్నిచేరి, ఎట్టి హింసలేని ఆ ప్రదేశములో గ్రీష్మకాల రాత్రిని గడిపితిని. ప్రొద్దుననే లేచి ఆ సరస్సును చేరగా వృద్థాప్యమంటిని శవమొకటి కనిపించెను. సరస్సుకు దగ్గరలోనే గొప్పకాంతితో ఆ శవముండెను. దానిని గూర్చి ఒక్క క్షణము ఆలోచించుచుంటిని. 70

అస్య తీరే న వై ప్రాణీ కోవాస్యేష సురర్షభః | మునిర్వా పార్థివో వాసి క్వ మునిః పార్థివో పి వా || 71

అథవా పార్థివసుతస్త సై#్యవం సంభవః కుతః | అతీతేహని రాత్రౌ వా ప్రాతర్వాపి మృతో యది || 72

ఆవశ్యం తు మయా జ్ఞేయా సరసోస్య వినిష్క్రియా | యావదేవం స్థితశ్చాహం చింతయానో రఘూత్తమ || 73

అధాపశ్యం ముహూర్తాత్తు దివ్యమద్భుతదర్శనమ్‌ | విమానం పరమోదారం హంసముక్తం మనోజవమ్‌ || 74

పురస్తత్ర సహస్రం తు విమానేప్సరసాం నృప | గంధర్వాశ్చైవ తత్సంఖ్యా రమయంతి వరం నరమ్‌ || 75

గాయంతి దివ్యగేయాని వాదయంతి తథాపరే | అథాపశ్యం నరం తస్మాద్విమానాదవరోహితమ్‌ || 76

స్వమాంసం భక్షయన్తం చ స్నాత్వా రఘుకులోద్వహ | తతో భుక్త్వా యథాకామం స మాంసం బహు పీవరమ్‌ || 77

అపతీర్య సరః శీమ్రం ఆరురోహ దివం పునః తమహం దేవసంకాశం శ్రియా పరమయాన్వితమ్‌ || 78

భో భో స్వర్గిన్‌ | మహాభాగ ! వృచ్ఛామి త్వాం కథం త్విదమ్‌ | జుగుప్సితస్తవాహారో గతిశ్చేయం తవోత్తమా || 79

యది గుహ్యం న చైతత్తే కథయత్వద్య మే భవాన్‌ | కామతః శ్రోతుమిచ్ఛామి కిమేతత్పరమం వచః || 80

కో భవాన్వద సందేహమాహారశ్చ విగర్హితః | త్వయేదం భుజ్యతే సౌమ్య కిమర్థం క్వ చ వర్తసే || 81

కస్యాయమైశ్వరో భావః శవత్వేన వినిర్మితః | అహారం చ కథం నింద్యం శ్రోతుమిచ్ఛామి తత్త్వతః || 82

ఈ సరస్సు తీరాన ప్రాణి ఒక్కటీ లేదు. ఈ శవమెవ్వరిది? దేవుడా. మునియా, రాజా ? మునికాదు, రాజైవుండునా? రాజపుత్రుడైన ఇట్లు సంభవించుట ఎట్లు ? సాయంత్రం, రాత్రి లేదా ప్రొద్దున మరణించియుండవచ్చునా? తప్పక దీని నిష్క్రియను తెలియవలయు'' అని ఆలోచించుచునుండగనే ఒక ముహూర్తములో అద్భుతమును గాంచితిని. ఒక దివ్యమైన విమానము, హంసలతో లాగబడుచూ మనో వేగముతో ఎదుట నిలిచెను. వేలకొలది అప్సరసలు, అదే సంఖ్యలో గంధర్వలు ఆ నరుని ఆనందింపజేయుచూ దివ్యగేయాలను గానము చేయుచుండిరి. వాద్యముల మ్రోగించుచుండిరి. అపుడు నేను విమానమునుండి దిగిన నరుని చూచితిని. అతను నేలదిగి తన మాంసమును తినుచుండెను. మాంసమును ఇష్టమువచ్చినంత తిని సరస్సులోదిగి మరల విమానము నెక్కెను. అపుడు నేను దేవునివలెనున్న అతనితో ఇట్లంటిని. 'ఓ స్వర్గవాసీ ! ఇదంతా యేమి ? నీ ఆహారము ? జుగుప్సితమైనది. గతి మాత్రముత్తముమైనది. రహస్యము కానిచో చెప్పుము. వినగోరితిని. నీ వెవరు ! ఈ ఆహారమేమి? నీవెందుకు దీనిని భుజించుచుంటివి ? నీవెక్కడ వుందువు ? ప్రభువువలెనుంటివి. శవమెట్లు నిర్మించబడెను. నింద్యమగు ఆహారమేమిటో వినగోరుచున్నాను. 82

శ్రుత్వా చ భాషితం తత్ర మమ రామ సతాం వర | ప్రాంజలిః ప్రత్యువాచేదం స స్వర్గీ రఘనందన || 83

శ్రుణుష్వాద్య యథావృత్తం మమేదం సుఖదుఃఖజమ్‌ | కామో హి దురతిక్రమ్యః శ్రుణు యత్‌ పృచ్ఛసే ద్విజ|| 84

పురా వైదర్భికో రాజా పితా మే హి మహాయశాః | వాసుదేవ ఇతి ఖ్యాతస్త్రిషు లోకేషు ధార్మికః || 85

తస్య పుత్రద్వయం బ్రహ్మన్‌ ద్వాభ్యాం స్త్రీభ్యామజాయత |

అహం శ్వేత ఇతి ఖ్యాతో యవీయాన్‌ సురథోభవత్‌ || 86

పితర్యుపరతే తస్మిన్‌ పౌరా మామభ్యషేచయన్‌ | తత్రాహం కారయన్‌ రాజ్యం ధర్మే చాసం సమాహితః || 87

ఏపం వర్షసహస్రాణి బహూని సముపావ్రజన్‌ | మమ రాజ్యం కారయతః పరిపాలయతః ప్రజాః || 88

సోహం నిమిత్తే కస్మింశ్చిద్వైరాగ్యేణ ద్విజోత్తమ | మరణం హృదయే కృత్వా తపోవనముపాగమమ్‌ || 89

సోహం వనమిదం రమ్యం భృశం పక్షివివర్జితమ్‌ | ప్రవిష్టస్తప ఆస్థాతుమసై#్యవ సరసోంతికే || 90

రాజ్యే భిషిచ్య సురథం భ్రాతరం తం నరాధిపమ్‌ | ఇదం సరః సమాసాద్య తపస్తప్తుం సుదారుణమ్‌ || 91

దశవర్షసహస్రాణి తపస్తప్త్వా మహావనే | శుభం తు భవనం ప్రాప్తో బ్రహ్మలోకమనామయమ్‌ || 92

అని నేననగా విని ఆ స్వర్గవాసి చేతులు జోడించి ఇట్లు బదులిచ్చెను. 'బ్రాహ్మణా ! సుఖదుఃఖములచే జనించిన నా ఈ వృత్తాంతమును వున్నది వున్నట్లుగా చెప్పెద వినుము. కోరిక దాట సులభము కానిది కదా ! పూర్వము విదర్భరాజు ''వాసుదేవుడనువాడుండెను. గొప్పకీర్తిగల యతడు నా తండ్రి. ఇద్దరు స్త్రీలవలన అతనికిద్దరు పుత్రులు గలిగిరి. నేను శ్వేతుడనువాడను. చిన్నవాడు సురథుడు. నా తండ్రి మరణించగా పౌరులు నన్ను రాజ్యసింహాసనముపై నభిషేకించిది. ధర్మమును ఆచరిస్తూ నేను రాజ్యమును పాలించుచుంటిని. ఇట్లు పెక్కు వేల సంవత్సరములు గడిచినవి. ప్రజలను నేను అధికకాలమును పాలించితిని. ఒకానొక కారణముచే వైరాగ్యమును పొంది మరణించు ఆలోచనతో తపోవనమును చేరితిని. ఈ వనము పక్షులు లేనిదై మనోహరముగా నుండ, దానిని ప్రవేశించి తపము చేయుటకు సరస్సుతీరమును చేరితిని. సురథుని అభిషేకించి, ఘోరతపస్సు చేయవలెనని ఈ సరస్సును చేరి, పదివేల సంవత్సరములు తపమాచరించి, కల్యాణకరమగు బ్రహ్మలోకమను భవనమును చేరితిని.

స్వర్గస్థమపి మా బ్రహ్మన్‌ క్షుత్పిపాసే ద్విజోత్తమ | అబాధేతాం భృశం చాహమభవం వ్యథితేంద్రియః || 93

తతస్త్రిభువనశ్రేష్ఠమవోచం వై పితామహమ్‌ | భగవన్‌ స్వర్గలోకోయం క్షుత్పిపాసావివర్జితః || 94

కస్యేయం కర్మణః పక్తిః క్షుత్పిపాసే యతో హి మే | అహారః కశ్చ మే దేవ బ్రూహి త్వం శ్రీపితామహ || 95

తతః పితామహః సమ్యక్‌ చిరం ధ్యాత్వా మహామునే | మామువాచ తతో వాక్యం నాస్తి భోజ్యం స్వదేహజమ్‌ ||96

ఋతే తే స్వాని మాంసాని భక్షయ త్వం తు హి నిత్యశః | స్వశరీరం త్వయా పుష్టం కుర్వతా తప ఉత్తమమ్‌ || 97

నాదత్తం జాయాతే తాత శ్వేత పశ్య మహీతలే | ఆగ్రహాద్భిక్షమాణాయ భిక్షాపి ప్రాణినే పురా || 98

న హి దత్తా గృహే భ్రాంత్యా మోహాదతిథయే తదా | తేన స్వర్గగతస్యాపి క్షుత్పిపాసే తవాధునా || 99

స త్వం ప్రపుష్టమాహారై ః స్వశరీర మనుత్తమమ్‌ | భక్షయస్వ చ రాజేంద్ర సా తే తృప్తిర్భవిష్యతి || 100

ఏవముక్తస్తతో దేవం బ్రాహ్మణమహముక్తవాన్‌ | భక్షితే చ స్వకే దేహే పునరన్యన్న మే విభో|| 101

క్షుధానివారణం నైవ దేహస్యాస్య వినౌదనమ్‌ | ఖాదామి హ్యాక్షయం దేవ ప్రియం మే న హి జాయతే || 102

స్వర్గముచేరిననూ నన్ను ఆకలిదప్పులు మిగుల బాధించసాగినవి. ఇంద్రియములు బాధించసాగినవి. అపుడు ముల్లోకలముల శ్రేష్ఠుడగు పితామహునితో ఇట్లంటిని. 'భగవాన్‌ ! స్వర్గలోకమిది, ఆకలిదప్పులు లేనిది. నాకిట్లు ఆకలి దప్పికలు కలుగుట ఏ కర్మ ఫలము ? నాకు ఆహారమేమిటో చెప్పుము' అనగా బ్రహ్మ చాలాసేపు ఆలోచించి నాతో ఇట్లనెను. '' నీ దేహమునుండి పొందు మాంసముదప్ప వేరొక ఆహారము నీకులేదు. నిత్యమూ నీవు నీ మాంసమును ఆరగింపుము. ఉత్తమతపమునాచరించుచూ నీ శరీరమును బాగుగా పోషించితివి. శ్వేతా ! మహీతలమున ఇవ్వనిచో కలుగదు. పూర్వము భిక్షను యాచించుచున్న ప్రాణికి కోపముతో నీవు దానమివ్వలేదు. భ్రాంతిచే అతిథికి ఇంట ఆతిథ్యమివ్వలేదు. దానిచే నీవు స్వర్గమునకు వచ్చికూడా ఆకలిదప్పుల పొందితివి. అట్టి నీవు ఆహరములచే పుష్టినొందిన నీ శరీరమునే భుజించుము. దానిచే నీకు తృప్తి కలుగును అనగా బ్రాహ్మణునితో నిట్లంటిని. నా దేహమును దినివేయగా మరల వేరొకటి లేదు. ఆకలి తీరుట లేదు. ఓదనము దక్క శరీరమునకు ఆకలి తీరుటెట్లు? అక్షయముగా తినుచున్ననూ ప్రీతి కలుగుట లేదు. 102

తతోబ్రవీత్ఫునర్బ్రహ్మ తవ దేహోక్షయః కృతః | దినే దినే తే పుష్టాత్మా శవః శ్వేత భవిష్యతి || 103

యావద్వర్షశతం పూర్ణం స్వమాంసం ఖాద భో నృప | యదాగచ్ఛతి చాగస్త్యః శ్వేతారణ్యం మహాతపాః || 104

భగవానతిదుర్ధర్షస్తదా కృచ్ఛ్రాద్విమోక్ష్యసే | స హి తారయితుం శక్త ః సేంద్రానపి సురాసురాన్‌ || 105

ఆహారం కుత్సితం చేమం రాజర్షే కిం పునస్తవ | సురకార్యం మహత్తేన సుకృతం తు మహాత్మనా || 106

ఉదధిం నిర్జలం కృత్వా దానవాశ్చ నిపాతితాః | వింధ్యశ్చాదిత్యవిద్వేషాద్వర్దమానో నివారితః || 107

లంబమానా మహీ చైషా గురుత్వేనాధవాసితా | దక్షిణా దిగ్ధివం యాతా త్రైలోక్యం విషమస్థితమ్‌ || 108

మయా గత్వా సురై సార్ధం ప్రేషితో దక్షిణాం దిశమ్‌ | సమాం కురు మహాభాగ గురుత్వేన జగత్సమమ్‌ || 109

ఏవం చ తేన మునినా స్థిత్వా సర్వా ధరా సమా | కృతా రాజేంద్ర మునినా ఏవమద్యాపి దృశ్యతే || 110

అపుడు బ్రహ్మ ఇట్లనెను. :- ''శ్వేతా ! నీ దేహము అక్షయమైనది. దినదినమూ నీశవము పుష్టిని పొందగలదు. రాజా ! వంద సంవత్సరములు నిండువరకు నీవు నీ మాంసమునే తినుము. గొప్ప తపస్వియగు అగస్త్యుడు అరణ్యమునకు వచ్చువరకు అట్లు చేయుము. తేజస్వియగు అగస్త్యుడు ఇంద్రాది 'దేవతలను, దానవులను తరింపజేయుటకు సమర్ధుడు. అతని రాకచే నీవు కష్టమునుండి ముక్తిని పొందెదవు. రాజర్షీ ! దేవదానవులనే తరింపజేయగలవాడు అగస్త్యుడు. ఇక నీ ఈ కుత్సిత ఆహారమును గూర్చి చెప్పుటయేమి? మహాత్ముడగు అగస్త్యుడు గొప్పదగు దేవకార్యమును నిర్వర్తించెను. సముద్రమును ఇంకిపోవునట్లుగా చేసి దానవుల సంహారమునకు దోడ్పడెను. సూర్యునిపై ద్వేషముతో పెరిగిన వింధ్యను అణిచివేసెను. వ్రేలాడుచున్న ఈ భూమిపై బరువువలన దక్షిణదిక్కు పైకెగియగా ముల్లోకములు సంకటములోనుండ, నేను దేవతలతో వెళ్ళి అగస్త్యుని 'జగత్తుని సమముగా చేయుము అని దక్షిణ దిక్కుకు పంపితిని. అపుడా ముని నిలువగా భూమియంతయూ సమమాయెను. ఓ రాజేంద్రా ! మునిచేసినది ఇప్పటికీ అట్లే కనిపించుచున్నది. 110

సోహం భగవతః శ్రుత్వా దేవదేవస్య భాషితమ్‌ | భుంజే చ కుత్సితాహారం స్వశరీరమనుత్తమమ్‌ || 111

పూర్ణం వర్షశతం చాద్య భోజనం కుత్సితం చ మే | క్షయం నాభ్యేతి తద్విప్ర తృప్తి శ్చాపి మమోత్తమా || 112

తం మునిం కృచ్ఛసంతప్తశ్చింతయామి దివానిశమ్‌ | కందా వై దర్శనం మహ్యం స మునిర్ధాస్యతే వనే || 113

ఏవం మే చింతయానస్య గతం వర్షశతం త్విహ | సోగస్త్యో హి గతిర్ర్బహ్మన్మునిర్మే భవితా ధృవమ్‌ || 114

న గతిర్భవితా మహ్యం కుంభయోనిమృతే ద్విజమ్‌ | శ్రుత్వేత్థం భాషితం రామ దృష్ట్వాహారం చ కుత్సితమ్‌ || 115

కృపయా పరయా యుక్తస్తం నృపం స్వర్గగామినమ్‌ | కరోమ్యహం సుధాభోజ్యం నాశయామి చ కుత్సితమ్‌ || 116

చింతయన్నిత్యవోచం తమగస్త్యః కిం కరిష్యతి | ఆహమేతత్‌ కుత్సితం తే నాశయామి మహామతే || 117

ఈప్సితం ప్రార్థయస్వాస్మాన్మనః ప్రీతికరం పరమ్‌ | స స్వర్గీ మాం తతః ప్రాహ కథం బ్రహ్మ వచోన్యథా || 118

కర్తుం మునే మయా శక్యం న చాన్యస్తారయిష్యతి | ఋతే వై కుంభయోనిం తం మైత్రావరుణ సంభవమ్‌ || 119

అపృష్టోపి మయా బ్రహ్మన్నేవమూచే పితామహః | ఏవం బ్రువాణం తం శ్వేతముక్తవానహమస్మి సః || 120

ఆగతస్తవ భాగ్యేన దృష్టోహం నాత్ర సంశయః | తతః స్వర్గీ స మాం జ్ఞాత్వా దండవత్పతితో భువి || 121

తముత్థాప్య తతో రామాబ్రవం కిం తే కరోమ్యహమ్‌ || 121 / 12

అనగా నేను విని నా శరీరమునే ఆహారముగా భుజించుచుంటిని. నేడు నూరు సంవత్సరములు పూర్తి అయినవి. అయిననూ నా కుత్సితాహారము క్షయము నొందుట లేదు. నాకు తృప్తి కలుగుటలేదు. కష్టములోనున్న నేనురాత్రింబవళ్ళూ మునిని గూర్చే ధ్యానించుచుంటిని. ఈ వనమున ఆ ముని ఎప్పుడు దర్శనమిచ్చునో గదా అని ఆలోచించుచున్న నేను నూరు సంవత్సరములు గడిపితిని. ఆ మునియే నాకు గతి. ఇది నిశ్చయము. ఆగస్త్యుడు దక్క నాకు వేరుగతి లేదు.' 'రామా ! ఆ రాజట్లనగా నేను విని కుత్సితాహారమును జూచి దయనొందితిని. అతని పాపమును నశింపజేసి అమృతమును భుజించునట్లు చేసెదననుకొని ఆతనితో నిట్లంటిని . ఆగస్త్యుడేమి చేయును ? నేనే నీ దురితమును నశింప జేసెదను. నీవు ఇష్టము వచ్చినది నా నుండి కోరుము' అన అతను నాతో 'బ్రహ్మమాట వేరొకవిధంగా ఎట్లగును ? మైత్రావరుణుడైన ఆగస్త్యుడే దక్క వేరొకరు నన్ను తరింపజేయజాలరు. నేనడగకపోయిననూ బ్రహ్మ నాతో ఇట్లనెను. అని అతడనగా నేను అతనితో ''నేనే అగస్త్యుడనని'' యంటిని. నేను నీ భాగ్యముచే కనబడితిని. సంశయము లేదు.'' అనగా ఆ శ్వేతుడు అగస్త్యుడను నేనే అని తెలిసి దండమువలె నేలపై బడెను. అపుడు నేను అతనిని లేపి ''నీకొరకేమి చేయుదు''నని యంటిని. 121 1/2

రాజోవాచ :- ఆహారాత్‌ కుత్సితాద్బహ్ర్మంస్తారయస్వాద్య దుష్కృతాత్‌ || 122

యేన లోకోక్షయః స్వర్గో భవితా త్వత్కృతేన మే || తతోః ప్రతిగ్రహో దత్తో జగద్వంద్య నృపేణ హి || 123

భవాన్మామనుగృహ్ణాతు ప్రతీచ్ఛస్య ప్రతిగ్రహమ్‌ | ఇదమాభరణం సౌమ్య తారణార్థం ద్విజోత్తమ || 124

బ్రహ్మార్షే ప్రతిగృహ్ణీష్వ ప్రసాదం కర్తుమర్హసి | ఇహ గాశ్చ సువర్ణం చ ధనం వస్త్రసమన్వితమ్‌ || 125

భక్ష్యః భోజ్యః చ విప్రర్షే దదామ్యాభరణం త్వహమ్‌ | సర్వకామప్రదం తుభ్యం సర్వాన్భోగాంశ్చ తే ద్విజ || 126

తారణ తు భవాన్మహ్యం ప్రసాదం కర్తుమర్హతి | తస్యాహం స్వర్గిణో వాక్యం శ్రుత్వా దుఃఖసమన్వితమ్‌ || 127

కృతా మతిస్తారణాయ న లోభాద్రఘనందన | గృహీతే భూషణ రామ మమ హస్తగతే తదా || 128

మానుషః పౌర్వికోదేహస్తదా నష్టోస్య భూపతే | ప్రణష్టే తు శరీరే చ రాజర్షిః పరయా ముదా || 129

మయోక్తోసౌ విమానేన జగామ త్రిదివం పునః | తేన మే శక్రతుల్యేన దత్తమాభరణం శుభమ్‌ || 130

తస్మిన్నిమిత్తే కాకుత్థ్స దత్తమద్భుతకర్మణా | శ్వేతో వైదర్భికో రాజా తదాభూద్గతకల్మషః || 131

ఇతి శ్రీపాద్మపురాణ ప్రథమే సృష్టిఖండే రామాగస్త్యసంవాదో నామ షడ్త్రింశోధ్యాయః.

అపుడా రాజు ఇట్లనెను :- ''భగవాన్‌ ! నన్నీ కుత్సితాహారముగా నున్న నా దుష్కృతమునుండి రక్షింపుము. దానిచే అక్షయలోకమగు స్వర్గము లభించును.' అని అతను దానమిచ్చెను. ''నాపై అనుగ్రహముతో దీనిని స్వీకరించుము. ఇక్కడ ఇదే గోవులు, సువర్ణము, ధనము, వస్త్రములు, భక్ష్యము, భోజ్యము. ఈ ఆభరణమును స్వీకరించుము. అన్ని కోరికల దీర్చు, అన్ని భోగములనిచ్చు ఈ ఆభరణమును గ్రహింపుము. నన్ను అనుగ్రహించుము. తరింపజేయుము.'' అని ఆ స్వర్గవాసి దుఃఖముతో పలుకగా ఆతనిని రక్షించవలెనని బుద్దికలిగినది. దయతోనే దక్క లోభముతో కాదు. రామా ! నేనా ఆభరణమును తీసికొనగానే, ఆ నరుడి పూర్వదేహము నశించి, ఆతను స్వర్గమును పొందెను. ఇంద్రుని వంటి ఆ శ్వేతుడే నాకీ ఆభరణము నిచ్చెను. ఆ కారణముచేతనే ఆభరణమునిచ్చెనని తెలయుము. ఈ విధంగా శ్వేతుడు పాపము తొలగినవాడాయెను. 131

ఇది శ్రీ పాద్మపురాణమున మొదటిదగు సృష్టిఖండమున రామాగస్త్యసంవాదమను ముప్పదియారవ అధ్యాయము

Sri Padma Mahapuranam-I    Chapters